- గౌరవం దక్కలేదని ఆవేదన
- నేడు బీజేపీలో చేరిక
కల్వకుర్తి, వెలుగు: మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని తన ఇంటిలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2018లో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరానని, అదే ఏడాది అసెంబ్లీ, పార్లమెంట్, జడ్పీ ఎన్నికల్లో కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించానని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ను సైతం ఓడించి చరిత్ర సృష్టించానని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ తన సేవలను ఉపయోగించుకొని, ఆ తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తిని అభివృద్ధి చేశానని, ఆ తర్వాత కల్వకుర్తి అభివృద్ధి కుంటుపడిందన్నారు. కల్వకుర్తి నిర్వాసిత రైతుల గురించి, కల్వకుర్తి అభివృద్ధిపై ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించినప్పటికీ ఏమాత్రం స్పందన లేదన్నారు. పార్టీలో సముచిత గౌరవం లేనప్పుడు బీఆర్ఎస్లో ఎందుకుండాలని ప్రశ్నించారు.
దేశంలో మోడీ ప్రభంజనం కొనసాగుతోందని, ఆయనను ఆదర్శంగా తీసుకొని శనివారం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్లో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో చేరనున్నట్లు చెప్పారు.రామాంజనేయులు, రాము, అంజయ్య, శేఖర్, అంజి మాస్టర్ పాల్గొన్నారు.