నాగర్ కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని మాజీ మంత్రి డా.నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల అక్రమాలు, నీటి వాటాలో తేడాలు తెలియని వాళ్లు తన పాపులారిటీ మీద సర్వే చేయడం ఏంటని మండిపడ్డారు. టికెట్వదులుకుని రాజ్యసభ వెళ్లడానికి ఒప్పుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో ఎలాంటి లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఎమ్మెల్సీకి నాగం సవాల్ విసిరారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఇసుక దందాలో ఎమ్మెల్యే మర్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్లకు భాగం ఉందన్నారు. ఎన్నికల తర్వాత కూచుకుళ్ల రాజేశ్రెడ్డికాంగ్రెస్లోనే ఉంటారన్న గ్యారంటీ ఉందా అని నిలదీశారు.బీఆర్ఎస్లో చేరితే పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ ఆఫర్ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు,ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు తాము నాగం వెంటే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో డా.నాగం శశిధర్ రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్, తిమ్మాజీపేట పాండు, నిజాం , బాలయ్య పలువురు నేతలు ఉన్నారు.