కేసీఆర్ నిజస్వరూపం తెలిసిపోయింది : విజయరామారావు

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ విజయ రామారావు జోస్యం చెప్పారు. మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి నిజస్వరూపం ఈ ఎనిమిదేండ్లలో తెలిసిపోయిందన్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, అధునాతన పనిముట్లు ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా నాయీ బ్రాహ్మణ సోదరులకు  ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రజకులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో  ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. మునుగోడులోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో విజయ రామారావు మీడియాతో మాట్లాడారు. 

గొల్ల, కుర్మల దగ్గర డబ్బులు తీసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని...ఇపుడు మునుగోడులో ఉపఎన్నిక ఉందని వారి అకౌంట్లలో డబ్బులు వేస్తోందన్నారు. గొర్రెల పథకం టీఆర్ఎస్ లీడర్లకు వరంగా మారిందని ఆరోపించారు. ముదిరాజులకు, మత్స్యకారులకు సంబంధించి చేపపిల్లల పంపకం లో కూడా అవినీతి జరిగిందని విజయరామారావు ఆరోపించారు.మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో పని చేసే  జర్నలిస్ట్ లకు ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు నెరవేరలేదన్నారు. దేవాలయాలలో దూప దీప నైవేద్యం పెట్టే అర్చకులకు జీత భత్యాలు ఇస్తామని నమ్మించారు. కానీ వారికి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్..అది కూడా ఇంతవరకు చేయలేదన్నారు.