ప్రణీత్​రావు ఎవరో తెల్వది.. ట్యాపింగ్​తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

  • ఈ​ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నరు
  • నా పేరు  చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నరు 
  • బీఆర్‍ఎస్​ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామెంట్​

వరంగల్‍, వెలుగు: ఫోన్‍ ట్యాపింగ్‍ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కావాలనే తనను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‍ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‍రావు ముఖం కూడా తనకు తెలియదన్నారు. 

అతడి అమ్మమ్మది తన సొంతూరైన పర్వతగిరి అని, వాళ్లు మాత్రం తనకు తెలుసునన్నారు. ప్రణీత్​రావు ఫ్యామిలీతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని, కనీసం పరిచయం కూడా లేదని ఒట్టేసి చెప్తున్నానన్నారు. ఫోన్‍ ట్యాపింగ్‍, వార్‍ రూమ్​ కేసులో తన పేరు చెప్పాలంటూ ప్రణీత్​రావు  మీద ఒత్తిడి తెస్తున్న విషయం తనకు రెండు రోజుల కిందే తెలిసిందన్నారు.  

వైఎస్‍ ఇబ్బంది పెట్టినా పార్టీ మారలే 

తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ మారాలని మాజీ సీఎం వైఎస్‍  ఎంతో ఇబ్బంది పెట్టారని, అయినా పార్టీ మారకపోవడంతో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేటను ఎస్సీ రిజర్వ్​చేయించారని ఎర్రబెల్లి ఆరోపించారు. బిజినెస్‍లు, ల్యాండ్‍ దందాలున్నోళ్లు, తప్పుడు పనులు చేసినోళ్లే  బీఆర్ఎస్​ను వదిలి అధికార పార్టీల్లో చేరుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ను వీడే ప్రసక్తే లేదని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తానని చెప్పారు.  ఒకప్పుడు ఎన్‍టీఆర్‍ను ఓడించిన జనాలు తిరిగి  భారీ మెజార్టీతో గెలిపించారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. 

ఎలక్షన్లయ్యాక  స్కీమ్​లు ఎత్తేస్తరు

ఎంపీ ఎలక్షన్లు పూర్తి కాగానే రాష్ట్రంలో ఆరు గ్యారంటీ స్కీమ్​లను  ఎత్తేస్తారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రేవంత్‍రెడ్డికి మొదటినుంచి మాయమాటలు చెప్పడం అలవాటేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటలన్నీ ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‍ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍ భాస్కర్‍, పెద్ది సుదర్శన్‍రెడ్డి పాల్గొన్నారు.