
- మాజీ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తానూ ఢిల్లీలో దీక్ష చేసేందుకు సిద్ధమని మాజీమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీ గణన శాస్ర్తీయంగా జరగలేదని తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు ఆధ్వర్యంలో 2021లో బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. అప్పట్లోనే కులగణన చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గత ప్రభుత్వం జీవో 26ను తీసుకొచ్చిందని , దాన్ని పక్కన పెట్టి జీవో 18 ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీ కమిషన్ ద్వారా చేయించాల్సిన సర్వేను ప్లానింగ్ బోర్డు ద్వారా నిర్వహించారని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్నూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు సీఎం రేవంత్ బాధ్యత తీసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమని వివరించారు.