యూట్యూబర్లపై ఉక్కుపాదం కరెక్ట్ కాదు: హరీష్ రావు

యూట్యూబర్లపై ఉక్కుపాదం కరెక్ట్ కాదు: హరీష్ రావు
  • యూట్యూబర్లు తలుచుకుంటే..సీఎం రేవంత్​ను గద్దె దించడం ఖాయం
  • వాళ్లపై ఉక్కుపాదం మోపడం కరెక్ట్ కాదు: హరీశ్​రావు 

షాద్ నగర్, వెలుగు: యూట్యూబర్లు తలుచుకుంటే సీఎం రేవంత్ ను గద్దె దించడం పెద్ద విషయమేమీ కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. గతంలో యూట్యూబ్ చానళ్లను అడ్డం పెట్టుకొని వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి.. నేడు అదే యూట్యూబర్ లపై సీఎం రేవంత్​రెడ్డి ఉక్కుపాదం మోపడం కరెక్ట్ కాదని అన్నారు.

 యూట్యూబర్లపై సీఎం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య చనిపోయిన విషయాన్ని తెలుసుకొని మంగళవారం హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తున్న సమయంలో షాద్ నగర్ బై పాస్ లోని ఓ హోటల్ వద్ద ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను, మాట తీరును ఎండగడుతుంటే అది చూసి తట్టుకోలేక యూట్యూబర్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డురంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒకలా ఉంటారని.. అవసరం తీరిపోయాక మరోలా ఉంటారన్నారు. ‘ఒడ్డు దాటకముందు ఓడ మల్లన్న.. ఒడ్డు దాటక బోడ మల్లన్న’ తీరుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 

‘ఈ యూట్యూబ్ లనే వాడుకొని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. వాళ్ల బండారాన్ని బట్టబయలు చేసి.. అవినీతిని బయట పెడుతుంటే రేవంత్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని, ఆ అక్కసును యూట్యూబర్ల మీద చూపిస్తున్నారని మండిపడ్డారు.