డెడ్​లైన్లు మారినా నేటికీ రుణమాఫీ కాలే : హరీశ్​రావు

డెడ్​లైన్లు మారినా నేటికీ రుణమాఫీ కాలే : హరీశ్​రావు
  • వనపర్తి రైతు నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీశ్​ రావు
  • బరాబర్​ ఎగవేతల ముఖ్యమంత్రి అని పిలుస్తామని వెల్లడి

వనపర్తి, వెలుగు: హెడ్​లైన్లు మారినా, డెడ్​లైన్లు మారినా నేటికీ రుణమాఫీ కాలేదని..దేవుళ్ల మీద ఒట్లు వేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సీఎం రేవంత్​రెడ్డి తిట్లు అందుకుంటున్నాడని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బరాబర్​ ఎగవేతల ముఖ్యమంత్రి అని పిలుస్తామని తెలిపారు. శనివారం వనపర్తిలో జరిగిన రైతు ప్రజా నిరసన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేసీఆర్, న్యూట్రిషన్  కిట్, రైతుబంధు, రైతుబీమా బంద్​ చేశారని,  ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్  ప్రశ్నిస్తున్నందున సగం చేపలను చెరువుల్లో పోస్తూ, మిగతా సగం ఎగవేశారని విమర్శించారు.

 రాష్ట్రంలో రుణమాఫీకి 42 లక్షల మంది అర్హులు కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మందికి ఇచ్చాడని, మిగతా వారికి సోనియా జన్మదినమైన డిసెంబర్ 9కి ఇస్తామని ముందు చెప్పి ఇప్పుడేమో ఆ సమయానికి 2 లక్షల మందికి ఇస్తామని అంటున్నారన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు, భార్య భర్త, పెళ్లి అంటూ ఇలా తలా తోకాలేని కోతలు పెడుతున్నారని, గతంలో కేసీఆర్  అందరికీ రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. ఒట్టు వేసి మాట తప్పిన సీఎంను క్షమించమని, యాదాద్రిలో దేవుడిని కోరితే తనపై కేసు పెట్టారని తెలిపారు. గతంలో కేసీఆర్ కరోనా వంటి కష్టకాలంలోనే రైతులకు రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు.  

కాంగ్రెస్  పాలనలో ఏమి జరుగుతుందో అన్నీ తెలిసి కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డి మౌనంగా ఎందుకున్నాడో అర్థం కావడం లేదన్నారు. వడ్లకు, పత్తికి, మక్కలకు, శనగలకు బోనస్ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తానని మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛనుదారులకు పాత బకాయిలతో పాటు తాను ఇస్తానన్న రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు.

 మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఆ తరువాత మోసం చేయడంతో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఎవరూ టైం అడగకున్నా, వారే టైం నిర్ణయించుకుని టైం దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాట తప్పారన్నారు. ఆఖరికి పోలీసులను సైతం వదలలేదన్నారు. సీఎం సీటును అడ్డుకుంటారన్న భయంతో నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులిచ్చి పాలమూరు, -రంగారెడ్డికి ఇవ్వలేదని విమర్శించారు.

 ఇదిలాఉంటే అలంపూర్​ ఎమ్మెల్యే విజయుడు సదస్సు హాజరు కాలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎమ్మెల్సీ నవీన్​కుమార్​రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య, నాయకులు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్, దేశపతి శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజని పాల్గొన్నారు.