హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదు అని, ప్రజా పీడన అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ధర్నాలు చేస్తున్నారని, ఆఖరికి పోలీసులు కూడా రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్, గతంలో ఉన్న రూ.10వేలు కూడా ఇవ్వలేదన్నారు. పత్తికి మద్దతు ధర రాకపోయినా సీఎం, మంత్రులు నోరుమెదపడం లేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో మక్కల కొనుగోలు కేంద్రాలే ప్రారంభం కాలేదన్నారు. వడ్లు కొనుగోళ్లను ప్రారంభించుడే తప్ప, వాటిని కొనే దిక్కులేదని విమర్శించారు.
వడ్లకు రూ.2,320 మద్దతు ధర రావాల్సి ఉండగా, రూ.1,800 నుంచి రూ.1,900కే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పత్తికి రూ.7,521 మద్దతు ధర రాకపోవడంతో రూ.5 వేలకే విక్రయించి నష్టపోతున్నారన్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగులను, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారన్నారు. సీఎం మెదడులో విషం తప్ప, విజన్ లేదని దుయ్యబట్టారు.
ఫ్యామిలీతో రేవ్ పార్టీ చేసుకుంటరా..
కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా దాడులు చేయించిందని, రేవ్ పార్టీలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోం అన్నారు. పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇదెక్కడి న్యాయం అని అడితే ఉద్యోగాలు ఊడగొడుతారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బండి సంజయ్ ఆయన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ తానా అంటే, బండి తందాన అంటున్నారని హరీశ్ విమర్వించారు. ‘బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నడు” అని ఎద్దేవా చేశారు.