
సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సోమవారం (మార్చి 24) గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దింది కేసీఆర్. గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, ఉండేవి. కేసీఆర్ వచ్చాక ప్రేమగా మారింది. దేశ ప్రధానిని గజ్వేల్‌కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది’’ అని అన్నారు.
తెలంగాణలోని మిగతా పట్టణాలకు ధీటుగా కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధి చేశారన్నారు. గతంలో నీళ్ళకోసం తిప్పలు పడ్డ గజ్వేల్‌లో ఇప్పుడు నీటి కొరత లేకుండా చేసింది కేసీఆర్ అని అన్నారు. మిషన్ భగీరథ నీటిని మొట్టమొదట గజ్వేల్‌కు అందించారని.. ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్లను మిషన్ భగీరథ నీటి ద్వారా కేసీఆర్ పలకరిస్తున్నాడని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక మిషన్ భగీరథ నీటిలో కొరత పెట్టారని విమర్శించారు.
ALSO READ | బండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదు.. అధ్యక్ష పదవికోసమే ఆ వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కేసీఆర్ కొండపోచమ్మ, మల్లన్న సాగర్ల ద్వారా సాగుకు నీరందించడంతో గజ్వేల్‌లో ధనలక్ష్మి గలలాడింది. రేవంత్ రెడ్డి పాలన వల్ల గజ్వేల్ నుంచి ధనలక్ష్మి పారిపోతుందని ఎద్దేవా చేశారు. రైల్ అనేది గజ్వేల్ ప్రజలకు ఒక కళ.. గజ్వేల్‌కు రైల్ తీసుకొచ్చి కేసీఆర్ ప్రజల కలను సాకారం చేశారని అన్నారు. గజ్వేల్‌కు, కేసీఆర్‌కు మధ్య తల్లి పిల్లల బంధమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.181 కోట్ల అభివృద్ధి నిధులు రద్దు చేసి గజ్వేల్‌కు అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ గర్జిస్తే మల్లన్న సాగర్ నీళ్ళు విడుదల చేశారన్నారు. 15 నెలల కాలంలో గజ్వేల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. గజ్వేల్‌పై సీఎం రేవంత్‌కు సవతి తల్లి ప్రేమ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం చేశామని అన్నారు. మరీ ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది. వారిని ఆదుకోండని అన్నారు. రేవంత్ రెడ్డి ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.