గత బడ్జెట్ నిధుల్లో భారీగా కోత పెట్టిన్రు.. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

గత బడ్జెట్ నిధుల్లో భారీగా కోత పెట్టిన్రు.. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసాకు గత బడ్జెట్‎లో రూ.15 వేల కోట్లు పెట్టి అందులో రూ.4,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన గురువారం మాట్లాడారు. ‘‘రుణమాఫీకి బడ్జెట్లో రూ.31 వేల కోట్లు ఇస్తామని చెప్పి, రూ.20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రుణమాఫీలోనూ రూ.11 వేల కోట్లు కోత పెట్టారు. ఫసల్ బీమాకు రూ.1,300 కోట్లు పెట్టి ఒక్క రూపాయి ఇవ్వలేదు. వానాకాలంలో ఇవ్వాల్సిన రైతుబంధు రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టారు. 

యాసంగిలో రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ.3,500 కోట్లు ఇచ్చారు. రైతుభరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీలో కలిపారు. గత బడ్జెట్‎లో రైతులకు అన్యాయం చేశారు. 4.50 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడ్తామని రూ.22,500 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మైనారిటీలకు రూ.3 వేల కోట్ల బడ్జెట్ పెట్టి.. అందులో రూ.1,900 కోట్లు కోత పెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‎లో కూడా 60 శాతం మించి ఖర్చు పెట్టలేదు’ అని హరీశ్ రావు అన్నారు. 

సీఎం, డిప్యూటీ సీఎం లెక్కల్లో ఎవరిది వాస్తవం..?

గడిచిన 16 నెలల్లో అప్పులు కట్టేందుకు రూ.88,564 కోట్లు ఖర్చుపెట్టామని డిప్యూటీ సీఎం చెప్పారని, ఇదే విషయమై రూ.1.53 లక్షల కోట్లు అప్పులు, మిత్తీలకు చెల్లించామని సీఎం అన్నారని హరీశ్ తెలిపారు. ఇద్దరి లెక్కల్లో చాలా తేడాలున్నాయన్నారు. ఫైనాన్స్ మినిస్టర్‎గా భట్టి వాస్తవం చెప్పారని, సీఎం బురిడీ కొట్టించి కార్పొరేషన్ అప్పులు కూడా కలిపి చెప్పారని హరీశ్ విమర్శించారు. కాగ్ రిపోర్టు ప్రకారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.5.17 లక్షల కోట్లు అని తెలిపారు. కార్పొరేషన్ అప్పులు, గత ప్రభుత్వ అప్పులు తీసేస్తే రూ.4.18 లక్షల కోట్లే అని వివరించారు. బడ్జెట్ ప్రకారంగా చూసినా రూ.4.22 లక్షల కోట్లే అని తెలిపారు.