![రిజర్వేషన్లు ప్రకటించాకే ఎన్నికలు నిర్వహించాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు](https://static.v6velugu.com/uploads/2025/02/former-minister-harish-rao-demands-elections-to-be-held-only-after-the-reservation-is-announced_Hd9xkPZ3L7.jpg)
సిద్దిపేట, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రామిస్ డే సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి టి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టారనే విషయం మరవొద్దన్నారు.
రిపబ్లిక్ డేకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారని, ఇప్పటివరకు పది పైసల మంది కూడా సాయం అందలేదన్నారు. పంద్రాగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని, ఆయనకు మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకోవడం చేతకాదన్నారు.
కేసీఆర్ సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి వానకాలం రైతుబంధు ఎగబెట్టి రూ.8 వేల కోట్లు రైతులకు అందకుండా చేశారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు.