ఆర్ఎంపీ, పీఎంపీలకిచ్చిన హామీలు అమలు చేయాలి : హరీశ్ రావు

ఆర్ఎంపీ, పీఎంపీలకిచ్చిన హామీలు అమలు చేయాలి : హరీశ్ రావు
  • వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను మంజూరు చేయాలి

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.  వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మల్లేశం అధ్యక్షతన మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ద్వారా దాడులు చేస్తున్నదని ఆరోపించారు. 

అక్రమ కేసులు పెట్టి వారిని భయపెడుతున్నదని ఆరోపించారు. వెంటనే వేధింపులను ఆపి పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయని, రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదని ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చకు ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధమనని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆర్ఎంపీ, పీఎంపీలకు హరీశ్ కోరారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ప్రతినిధులు హుస్సేన్, హరిబాబు, రాజమౌళి, కొండల రావు, విష్ణు, అశోక్, రాజమల్లు, రమేష్, నరేందర్, కాజా, శ్రీనివాస్ రావు, గణేశ్, నర్సింలు, మనోజ్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.