- రేషన్‌కార్డు నిబంధనను తొలగించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రుణాలు చెల్లించిన వారికి కూడా సానుభూ తితో ప్రభుత్వం వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలన్నారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా హాల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతులకు బ్యాంకులు పాస్‌బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి తప్పితే, రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదన్నారు. రైతులంతా పరిగెత్తి వెళ్లి రుణాలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. ఒకవేళ రేషన్ కార్డులు ఉన్న రైతులకే రుణమాఫీ చేయాలన్న ఉద్దేశం ఉంటే, రేషన్ కార్డు ఉన్నవాళ్లే వెళ్లి రుణాలు తీసుకోవాలని చెప్పి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అన్న నిబంధన కూడా సరికాదని, కుటుంబంలో ఎంత మందికి రుణాలు ఉంటే అంతమందికి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.