మహబూబాబాద్: వరంగల్ డిక్లరేషన్ అమలు కోసం ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఫైర్అయ్యారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో మూసీకి అనుకొని ఉన్న పేదల ఇండ్లు కూలగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో హరీశ్ రావు మాట్లాడుతూ ‘పది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.
రెండు లక్షలకు పైన రుణమాఫీగా క్లారిటీ లేదు. 31 సాకులు పెట్టీ ఎగవెట్టే ప్రయత్నం చేసిండు. రైతు బంధు, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సప్పుడు లేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా పోతుంది. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తం. రుణమాఫీ అమలు చేయిస్తాం. ప్రజల సమస్యలు పక్కకు పోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తున్నది. హైదరాబాబాద్ లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతిపక్షంగా వెంటపడి అడుగుతాం ’అని అన్నారు.