- ఉచిత బస్ తప్ప గ్యారంటిలన్నీ తుస్సేనని విమర్శ
- ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు ఉన్నారని వెల్లడి
- ఖమ్మంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి
ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకం, దేవుళ్లపై ప్రమాణాలు తప్ప రాష్ట్రానికి చేసిన అభివృద్దేమి లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఈ విషయంపై హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డిని కోరారు. వంద అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఒక్కసారి మోసపోతారే తప్ప, ప్రతిసారి మోసపోరని పేర్కొన్నారు.
బుధవారం ఖమ్మంలో నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థినే ఎన్నుకోలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి చేస్తదా.. అని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు.. వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ జిల్లా అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. జిల్లాలోని ప్రజలు తాగు, సాగు నీరు కోసం అల్లాడుతుంటే, వారు టికెట్ల కోసం కొట్లాడుతున్నారని మండిపడ్డారు. గాల్లో విహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేల కిందకు రావాలంటే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. మహిళలకు భరోసా, రైతు బంధు రూ.15 వేలు, వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, తులం బంగారం, ఆడ పిల్లలకు స్కూటీ హామీలను ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఒక్క ఉచిత బస్సు తప్ప మిగిలిన హామీలన్నీ తుస్సేనని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ గెలుపు.. గ్యారంటీల అమలుకు మలుపు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గ్రానైట్ పరిశ్రమకు రాయల్టీ బంద్ చేసిందని హరీశ్ అన్నారు. నామా గెలుపు ఆరు గ్యారంటీల అమలుకు మలుపు కావాలన్నారు. కొందరు వాళ్ల అవసరం కోసం పార్టీ మారొచ్చు.. కానీ జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకత్వం పటిష్టంగా ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీఎం విజయన్.. బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేస్తున్నారని ఆరోపిస్తుంటే, లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పక్షాన ఎందుకు నిలబడాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ సెక్యులర్ పార్టీ అన్నారు. లిక్కర్ కేసు బోగస్ అని రాహుల్ గాంధీ అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అవినీతి అంటారని ఎద్దేవా చేశారు.
ఒక్క మైనార్టీ లీడర్‌కు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందో లేదో మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. కల్లాలలో ధాన్యం కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల స్కీమ్స్‌ను నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, సీపీఎస్ ముచ్చటే మర్చిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు మే 13 వరకు వేచి చూడాలని కార్యకర్తలకు చెప్పారు.
పార్టీ మరినవాళ్లను జనం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కొత్త తరాన్ని పార్టీలోకి తీసుకొని ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్‌కు బాసటగా నిలిచే సమయం ఆసన్నమైందన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ సాకుతో సంక్షేమ పథకాలను నిలిపివేసిందని మండిపడ్డారు. రూ.7,700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.