
సిద్దిపేట, వెలుగు: కళ్లు ఉండి కల్లు లేని కబోధుల్లా, చెవులుండి చెవిటివాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందోని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద రంగసాయక సాగర్ రిజర్వాయర్ ను సందర్శించి మాట్లాడారు.
గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తూ ప్రజలకు నష్టం చేయవద్దన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎస్సారెస్పీలో నీరు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను బాగు చేసే తీరిక లేదన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ మీద కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నామన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ కు థ్యాంక్స్
సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సీజన్ లో 50 వేల ఎకరాల్లో పంట సాగవుతుంటే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగానే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్‌కు పంపినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పంట కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద తిరుగుతూ నీటిని పరిశీలించారు.