- కాంగ్రెస్, బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తున్నయి: హరీశ్‌రావు
ఖమ్మం / సత్తుపల్లి / హైదరాబాద్ వెలుగు: హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయడంతో పాటు మరో పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్, బారుగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ ను యూటీ చేయాలని కుట్ర చేస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణ, తల లేని మొండెంలా అవుతుందన్నారు. హైదరాబాద్ ను ఇంకో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనుకుంటున్న వారికి బుద్ధి చెప్పాలన్నా, తెలంగాణ ప్రజలకు మాత్రమే హైదరాబాద్ దక్కాలన్నా ఈ ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డిని గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే కాంగ్రెస్ మోసాలు జనాలకు అర్థమయ్యాయన్నారు. ఆరింటిలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. వడ్ల బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ మాట మార్చిందని, సన్న వడ్లకే ఇస్తామంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్ కు గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలని కోరారు.
టిమ్స్‌లపై కోమటిరెడ్డికి అవగాహన లేదు
తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్స్ భవన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. టిమ్స్‌ల పట్ల ఆయన కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శుక్రవారం ట్వీట్ చేశారు. ఎల్బీనగర్ టిమ్స్‌ను 14 అంతస్తుల్లో నిర్మిస్తుంటే, మంత్రి 27 అంతస్తులు అని మాట్లాడుతుండటం అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఎక్కువ అంతస్తుల హాస్పిటల్స్ వల్ల పేషెంట్లు ఇబ్బంది పడ్తరని మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఎత్తైన హాస్పిటళ్లు కడుతున్న విషయం ఆయనకు
తెల్వదా అని హరీశ్ ప్రశ్నించారు.