హైదరాబాద్, వెలుగు: సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కృషి ఫలితమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీతారామ క్రెడిట్‌ను కొట్టేయాలని కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. సీతారామకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం మాత్రమే కాంగ్రెస్ మంత్రులకు వచ్చిందని, కానీ, ప్రాజెక్టు కట్టినట్లు వారు కటింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టును 90 శాతం బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ప్రారంభించేది మాత్రమే కాంగ్రెస్ నేతలన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లా రెండు పంటలతో సస్యశ్యామలం అవుతుందని, సాగు, తాగు నీటికి సమస్య ఉండదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, బీఆర్‌ఎస్ నేత దిండిగల రాజేందర్‌తో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు పోటీపడి మరీ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారని, ఈ ప్రాజెక్టు క్రెడిట్ తీసుకునేందుకు పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రుల కంటే తానేం తక్కువ అన్నట్లు ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు అని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాలను తమ విజయాలుగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఫీట్లను చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ప్రాజెక్టును అడ్డుకోడానికి కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేసినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. కాగా, ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పారు.