రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : హరీష్రావు

జనగామ:కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి  హరీష్రావు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటలకు నీరందక ఒక్క దేవరుప్పులలో నే వందలాది బోర్లు వేసి రైతులు అప్పులపాలయ్యారన్నారు. ఎన్నికల్లో రైతులకు కిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. వందరోజులైనా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందన్నారు. 

ఇప్పటివరకు కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసింది లేదన్నారు హరీష్ రావు. రైతుబంధు రూ. 15వేలు ఇస్తామన్నారు.. రూ. 10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటలకు నీళ్లు లేక రైతులు కొత్తగా బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారని అన్నారు హరీష్ రావు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని చెప్పి మోసం చేసిందని చెప్పారు. 

రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. రెండు పంటలకు నీళ్లందాయి పంటలు బాగా పండాయన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందోత తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు అన్నారు. 

కాంగ్రస్ అడుగడుగునా రైతులను మోసం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది.. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. అయినా రైతులను ఓదార్చే ఓపిక, తీరిక ముఖ్యమంత్రి లేదని విమర్శించారు హరీష్ రావు.రైతులు పిట్టల్లా రాలిపోతుంటే.. ముఖ్యమంత్రిగానీ,  ఒక్క మంత్రి గానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ముఖ్యమంత్రికి ప్రతి పక్ష నాయకుల ఇళ్ల కు వెళ్లడానికి ..ఎమ్మెల్యేలను గుంజుకునేందుకు టైం ఉండి గానీ.. రైతులను పరామర్శించే టైం లేదా అని ప్రశ్నించారు.. 

మీరు తెరవాల్సింది రాజకీయ పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు హరీష్ రావు. నష్ట పోయిన రైతుకు ఎకరానికి రూ. 25 వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.