- అందుకే తిట్లు.. లేదంటే దేవుడి మీద ఒట్లు: హరీశ్ రావు
- రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ సహకరిస్తుందనడం మతిలేని మాటలు
- బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనడం దొంగే దొంగ అన్నట్లుందని ఫైర్
కరీంనగర్/సిద్దిపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దించేస్తారనే భయం ఆయన ముఖంలో కనిపిస్తోందన్నారు. అందుకే రెండు, మూడు రోజులుగా దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు చెప్తున్నారని విమర్శించారు.
అయితే తిట్లు.. లేదంటే దేవుడి మీద ఒట్లు తప్ప రేవంత్ రెడ్డి మాటల్లో ఏమీ ఉండటం లేదన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శనివారం రాత్రి మీడియాతో హరీశ్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా బీజేపీకి రేవంత్ రెడ్డి మద్దతిచ్చారని.. నాగార్జున సాగర్‌లో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని పెట్టిందన్నారు.
బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుందని రేవంత్ అనడం మతిలేనిమాటలని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ చెప్తుంటే.. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని సీఎం రెచ్చగొడుతున్నారని, ఇద్దరూ సెంటిమెంట్‌తో గెలవాలని చూస్తున్నారన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్లపైనా హరీశ్ స్పందించారు. ఆయన చేసిన కామెంట్లను పరిశీలిస్తామన్నారు.
శనివారం సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కూడా హరీశ్ మాట్లాడారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపరిచ్చారని, కిషన్ రెడ్డి తప్పించుకుని తిరిగారన్నారు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ పంపితే.. తానూ 5 నిమిషాల్లోనే పంపుతానన్నారు.