
వరంగల్/జనగామ, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వాళ్లు ఎవరో రాహుల్ గాంధీనే చూసుకోవాలన్నారు. ప్రధాని మోదీ చెడ్డోడు అని రాహుల్ అంటుంటే.. మంచోడు అని రేవంత్ అంటున్నారని.. మోదీ మంచోడు అంటే.. రాహుల్ చెడ్డవాడని అన్నట్లే కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తినో రాహుల్ ఇప్పటికైనా ఆలోచించాల న్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో సోమవారం సభ స్థలాలను హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం హనుమకొండ, జనగామలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఈ ఎలక్షన్లు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని అన్నడు. సీఎం పాలన బాగా లేదని జనాలే ఎన్నికల్లో ఓడించిన్రు. ఇప్పటికైనా సీఎం తన పదవికి రాజీనామా చేయాలి. రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్న టైంలో హుజూరాబాద్, మునుగోడులో డిపాజిట్ కూడా రాలేదు’’అని హరీశ్ అన్నారు.
నీళ్ల తరలింపుపై నిలదీసింది మేమే..
చంద్రబాబు గోదావరి జలాలు తీసుకెళ్తుంటే.. ఆయన రేవంత్ గురువు కాబట్టి కాంగ్రెస్ ఏం అడగడం లేదని, ఏపీలో బీజేపీ పొత్తుల పార్టీ కాబట్టి ఏం మాట్లాడటం లేదని హరీశ్ విమర్శించారు. బనకచర్లపై బీఆర్ఎస్ ఒక్కటే నిలదీసిందన్నారు. ‘‘కృష్ణా జలాల్లోనూ ఏపీ ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకెళ్లిపోయింది. దీంతో ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో పంటలు ఎండి పోయాయి. అప్పుడు కూడా నిలదీసింది బీఆర్ఎస్ పార్టీనే.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలం తా కోరుకుంటున్నరు.
నా హైట్పై రేవంత్, భట్టి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నరు. బాడీ షేమింగ్ విమర్శలు వాళ్ల హోదాకు సరికావు. ఏప్రిల్ 27న వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’అని హరీశ్ అన్నారు. రేవంత్ పాలనా వైఫల్యంతోనే కరువొచ్చి పంటలు ఎండిపోతు న్నాయని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, రేవంత్ వచ్చాక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్కు రూ.7 కోట్ల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో 33 రోజులు పంపులు బంద్ ఉన్నాయని, అందుకే తీవ్ర నష్టం జరి గిందన్నారు. మాజీ మంత్రులు ప్రశాంత్‍రెడ్డి, దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‍రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.