బ్రిజేష్ ఆదేశాలు.. ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే : హరీశ్ రావు

కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై  మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఆదేశాలివ్వడం ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ విజయమేనన్నారు.   పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్  చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేటెస్ట్ ఉత్తర్వులని చెప్పారు. 

కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించడం వల్ల నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నారు.  ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు హరీశ్ రావు.