రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ ​జిల్లా దిలావ‌‌ర్ పూర్, గుండంప‌‌ల్లి గ్రామాల మ‌‌ధ్య ఇథ‌‌నాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని కొన్నాళ్లుగా ఆందోళ‌‌న చేస్తున్న రైతుల‌‌కు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఇంద్రకరణ్​సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రైతుల‌‌పై లాఠీచార్జ్​చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అక్రమంగా బనాయించిన కేసుల‌‌ను వెంట‌‌నే ఎత్తివేయాలని డిమాండ్​చేశారు. ప్రజాభిప్రాయ సేక‌‌ర‌‌ణ చేయ‌‌కుండానే, పచ్చటి పంట పొలాల మ‌‌ధ్య ఇథ‌‌నాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమ‌‌తులు మంజూరు చేసిందన్నారు.

గత బీఆర్ఎస్​ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. 2023 ఫిబ్రవరి 24న అట‌‌వీ, ప‌‌ర్యావ‌‌ర‌‌ణ, వాతావ‌‌ర‌‌ణ మార్పుల శాఖ నేరుగా అనుమ‌‌తులు మంజూరు చేసిందని, ఆ తర్వాతనే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌‌లి ప‌‌ర్యావ‌‌ర‌‌ణ అనుమ‌‌తులు ఇచ్చిందన్నారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని, అనుమ‌‌తుల మంజూరు కేంద్రం ప‌‌రిధిలో ఉంటుందన్నారు.

రైతులు ఆందోళ‌‌న తర్వాతనే ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నిక‌‌లకు ముందు ఆందోళ‌‌న చేపట్టిన రైతులకు మ‌‌ద్దతు తెలిపామని, అవ‌‌స‌‌ర‌‌మైతే ఫ్యాక్టరీని త‌‌ర‌‌లిస్తామ‌‌ని హామీ ఇచ్చామని చెప్పారు. ఎన్నిక‌‌ల త‌‌ర్వాత ఫ్యాక్టరీ ప‌‌నులు ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేత‌‌లు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే స‌‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎవ‌‌రు ఉన్నారో రైతులు గ్రహించాల‌‌న్నారు. ఎమ్మెల్యే మ‌‌హేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచ‌‌రులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారని, కానీ తమపై బుర‌‌ద‌‌ జ‌‌ల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.