
- సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తా
- రైతు ధర్నాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదని, రైతుల జీవితాలతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఆర్డీవో ఆఫీస్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకతీతంగా తాను ఓ రైతుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పోరాడుతున్నానని తెలిపారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో రూ.6 కోట్లతో 40 ఎకరాల భూమని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చినప్పటికీ, ఇరిగేషన్ శాఖ నుంచి బఫర్ జోన్ కు సంబంధించిన అనుమతులు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు. నిర్మల్ సెగ్మెంట్ లో ప్రస్తుతం4 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ దిగుబడులు రాబోతున్నాయని, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నిర్మల్ లో ఫ్యాక్టరీ ఏర్పాటుతో సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
రైతులతో రాజకీయం చేసిన ఏ నాయకుడు మనుగడ సాధించలేదన్న విషయాన్ని మహేశ్వర్ రెడ్డి గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫ్యాక్టరీ నిర్మించేలా చొరవ తీసుకుంటానని తెలిపారు. రైతులు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ధర్నా చేస్తున్నామని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీవో రత్నకల్యాణి, కలెక్టర్ అభిలాష అభినవకు వినతిపత్రం అందజేశారు. మాజీ జడ్పీటీసీలు ఓస రాజేశ్వర్, అరుగుమీది రామయ్య, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.