కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్‌‌రెడ్డి

 కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్‌‌రెడ్డి

పెన్ పహాడ్, వెలుగు: సాగు నీరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే పంటలేసుకుని రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా రైతులకు సాగు నీరివ్వండని ఎండుతున్న పంటలను కాపాడాలని వేడుకున్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చిన్న గారకుంట తండా వద్ద ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఎండిన పంటలను చూసి ఆయన చలించారు. తండా వద్ద ఎండిన వరి చేనును మేస్తున్న గొర్రెలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. 

ఎండిన పంటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాపమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్  బటన్  ఆన్  చేస్తే పంటలన్నీ పండుతాయని కాళేశ్వరం తమ చేతికి ఇస్తే మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్లు పారిస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.