
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు దుర్ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఎస్ ఎల్ బీసీ ప్రమాద ఘటన వద్దకు బయల్దేరే ముందు గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు కదలకపోవడానికి నీటి ఊటనే కారణమన్నారు. నీటి ఊటను ఎదుర్కొనడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయని చెప్పారు. నీటిని బయటకి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదని, గతంలో తాను పరిస్థితిని కళ్లారా చూశానని తెలిపారు.
టెక్నాలజీ సరైనది కాదని ఆనాడే చెప్పామన్నారు. నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రలు కారణంగానే ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. ప్రాజెక్టుపై అవగాహన లేక మంత్రులు పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ మంత్రి వాటర్.. నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమెడియన్ అయ్యాడని విమర్శించారు.
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ బోరింగ్ మెషీన్ పద్ధతి సరైనది కాదని తెలంగాణ ఉద్యమ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.