
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితాన్ని పొందవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచంతో పోటీ పడాలంటే తప్పకుండా ఇంగ్లిష్, కంప్యూటర్ జ్ఞానం ఉండాలని చెప్పారు. అదే సమయంలో అమ్మ భాషను మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయాంజనేయ స్వామి దేవస్థానంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు రంగినేని ఉపేందర్ రావు నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు నాగవెల్లి ప్రభాకర్, కీసర అంజన్‌రెడ్డి, వనమా సుభాష్, అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవల్లి దశరథ, భక్తులు పాల్గొన్నారు.