వాన్ని నెట్టేయండి రా..!  జర్నలిస్ట్‌పై మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సీరియస్

వాన్ని నెట్టేయండి రా..!  జర్నలిస్ట్‌పై మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సీరియస్

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ నేత కేటీఆర్‌‌ కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌‌హౌస్​‌ పరిశీలన సందర్భంగా పలువురు జర్నలిస్టులకు మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. పంప్‌‌హౌస్​ ఎదుట కేటీఆర్‌‌ ప్రెస్‌‌మీట్‌‌ నిర్వహిస్తున్న సమయంలో స్థలాభావం వల్ల రష్‌‌ ఎక్కువైంది. రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న వివిధ పత్రికల, మీడియా ఛానల్స్‌‌ నుంచి ప్రతినిధులు వచ్చారు.

దీంతో కేటీఆర్‌‌తో పాటు మాజీ మంత్రులు కుర్చీల్లో కూర్చొగా మీడియా అంతా  ఎదురుగా నిలబడి ఉంది. ఆ టైంలో మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి లేచి నిలబడి మీడియా పర్సన్స్‌‌ దగ్గరికి వెళ్లి వెనక్కి వెళ్లాలని సూచించారు. వెనుకనుంచి నెడుతుండటంతో కరీంనగర్‌‌కు చెందిన ఓ ఎలక్ట్రానిక్‌‌ మీడియా ప్రతినిధి అనుకోకుండా ముందుకు జరిగారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి ‘వాన్ని నెట్టేయండి  రా’ అని పరుష పదజాలాన్ని ఉపయోగించారు.

దీంతో ఆ మాటలు విన్న జర్నలిస్టులంతా మాజీ మంత్రిపై ఎదురుతిరిగారు. ‘మీడియా వాళ్లని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం ఊరుకోమని.. మేమొచ్చింది ఎవరికోసం.. మీరు పిలిస్తేనే ఇక్కడికి వచ్చినం కదా.. వాడు.. వీడు అంటే ఎవరూ పడరు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మీరు ఇలాగేనా మాట్లాడేది’  అంటూ జర్నలిస్టులు ఫైర్‌‌ అయ్యారు. మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి ‘సారీ’ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో హుజురాబాద్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డి, కరీంనగర్‌‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమణారావు ఆ మీడియా పర్సన్‌‌కి క్షమాపణలు చెప్పి గొడవ పెద్దది కాకుండా చూశారు. దీంతో కేటీఆర్‌‌ ప్రెస్‌‌మీట్‌‌ జరిగింది.