కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి యశోద హాస్పిటల్ లో చేరారు. మోకాలి శాస్త్ర చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పూర్తి చెకప్ చేశారు. జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
జానారెడ్డి వయస్సు 76 సంవత్సరాలు. తెలంగాణలోనే మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా.. రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర జానారెడ్డికి ఉంది. రాజకీయాల్లో అజాత శత్రువుగా.. అన్ని పార్టీల్లోని నేతలకు ఇష్టమైన నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన శైలిలో పోరాటం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని.. కాంగ్రెస్ పార్టీని ఒప్పించటంలో ఎంతో కృషి చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన రికార్డ్ కూడా జానారెడ్డి సొంతం.
జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.