జూన్​లో క్లారిటీ ఇస్త.. రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్​

జూన్​లో క్లారిటీ ఇస్త.. రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్​

జూన్​లో క్లారిటీ ఇస్త.. రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్​
మాతో కలిసి రావడానికి చాలా మంది రెడీగా ఉన్నరు
ఎవరెవరు వస్తారనేది త్వరలోనే చూస్తరు
మాది ప్రజల దారి.. బీఆర్​ఎస్​ది గోదారే
కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : తన రాజకీయ భవిష్యత్తుపై జూన్​లో క్లారిటీ ఇస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యంగా తమ వ్యూహరచన ఉంటుందని చెప్పారు. 

జనాన్ని ఏకం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నివర్గాల వారిని ఉద్యమ తరహాలో ఏకం చేస్తామని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తన దారి ప్రజల దారి అని, ఈసారి బీఆర్ఎస్‌ పార్టీది గోదారే అని అన్నారు. ‘‘నాపై  సెన్స్ లేనోళ్లు ఏదిపడితే అది మాట్లాడుతున్నరు” అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాను  గెలిస్తే.. ఎక్కడ మంత్రి పదవి రాదేమోననే భయంతో సొంత పార్టీ వాళ్లే తన ఓటమిలో భాగమయ్యారన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్​లో తనకు సభ్యత్వమే లేదని, అలాంటిది తనను ఎట్లా సస్పెండ్ చేస్తారని జూపల్లి  ప్రశ్నించారు. 

‘‘నేను ఆఫర్ల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు” అని చెప్పారు. కేసీఆర్​ను గద్దె దించేందుకు కలిసి రావాలని ఈటలను అడిగింది నిజమేనని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తమతోపాటు కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, ఎవరెవరు వస్తారనేది త్వరలోనే  చూస్తారని అన్నారు. ‘‘నేను, పొంగులేటి.. ఇద్దరమే కాదు.. చాలామంది మాతో మాట్లాడుతున్నరు. జూన్ లో  సస్పెన్స్ కు తెరపడుతుంది” అని జూపల్లి కృష్ణారావు చెప్పారు.