టీఆర్ఎస్, బీజేపీ అహంకారంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది
కేసీఆర్ ను ఓడించి నీతినిజాయితీకి పట్టం కట్టాలి: జానారెడ్డి
నల్గొండ జిల్లా: ఎన్నికల ముందు రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందునే కేసీఆర్ ను ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. జానారెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ ను ఓడించి గుణపాఠం చెప్పాలని కోరారు. నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్దతుగా జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నిక అర్ధంకాని అహంకారానికి నీతి నిజాయితీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. రెండు పార్టీల అహంకారానికి జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. దేశంలో అభివృద్ధికి మూలం కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. మహిళా సంఘం ద్వారా కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేని రుణాలు ఇచ్చిందన్నారు.
డబల్ బెడ్రూం ఇండ్లు లేవు, ఫించన్ లేదు, రేషన్ కార్డులు లేవు, రుణమాఫీ వంటి అనేక సంక్షమ పధకాలు చెప్పే వరకే కానీ పనులు చేయడం చేతకాదని విమర్శించారు. డిండి ప్రాజెక్టు 3 ఏండ్లలో పూర్తి చేస్తామన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తుంటే 30 సంవత్సరాలు అయినా పూర్తి చేసేటట్లు లేదన్నారు. 15 సంవత్సరాల క్రితమే మేము ఉచిత కరెంట్ ఇచ్చినం అని గుర్తు చేస్తూ.. టీఆర్ఎస్ వారు ఇప్పుడు తామే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని జానారెడ్డి ఆరోపించారు.
ప్రజల అభిమానం.. గుండె ధైర్యంతోనే మీ ముందుకు వచ్చా: పాల్వాయి స్రవంతి
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి ఉప ఎన్నికలో తనదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ఇచ్చిన గుండె ధైర్యం, ప్రజల అభిమానంతోనే మీ ముందుకు వచ్చానన్నారు. తెలంగాణలో అభివృద్ధి లేదు, ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదు, కొత్త పథకాలు లేవు, డబుల్ బెడ్రూం ఇండ్లను అందించలేదంటూ విమర్శలు గుప్పించారు. చుక్క ముక్క తోటే ఓట్లు కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని పాల్వాయి స్రవంతి ఆరోపించారు.