
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు దక్కలేదని అసంతృప్తి.. రేవంత్‌ను కలిసి లేఖ
హనుమకొండ, వెలుగు : పీసీసీ ఎగ్జిక్యూటివ్కమిటీ మెంబర్ పదవికి మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. ఆమె ఆదివారం పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు గానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్క లీడర్పేరు గానీ లేకపోవడం మనస్తాపం కలిగించిందని లేఖలో సురేఖ పేర్కొన్నారు. ‘‘పొలిటికల్అఫైర్స్కమిటీలో నా కంటే జూనియర్లకు అవకాశం ఇచ్చారు. నన్ను మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం బాధ కలిగించింది.
రాజకీయ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లతో పాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని వారిని నియమించిన కమిటీలో నన్ను నియమించడం అవమానంగా భావిస్తున్నాను. మా కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు. వైఎస్సార్ కుటుంబం కోసం మంత్రి పదవినే వదులుకున్నాం. మాకు ఆత్మాభిమానమే ముఖ్యం. అందుకే ఎగ్జిక్యూటివ్కమిటీ మెంబర్పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను, నా భర్త కొండా మురళి వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాం. మేము పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఎన్నడూ ప్రవర్తించలేదు. సామాన్య కార్యకర్తల్లాగానే పార్టీలో కొనసాగుతాం” అని లేఖలో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ హైకమాండ్ శనివారం పీసీసీ పొలిటికల్ అఫైర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ప్రకటించింది.