రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలె : కొండా సురేఖ

వరంగల్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ రావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు భయం పట్టుకుందన్నారు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావే అని చెప్పారు. వరంగల్ తూర్పునియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే వరంగల్ పై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘పాలకుర్తి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలి.. లేదంటే మేమూ పోటీకి సిద్ధం. వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంత విశ్వసించామో.. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అంతే విశ్వసిస్తున్నామని కొండా సురేఖ అన్నారు. రేవంత్ రెడ్డితో ఇందిరమ్మ పాలన సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతోంది. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.