ఖిలా వరంగల్, వెలుగు : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కనుసన్నల్లో పోలీసులు సీపీఎం, సీపీఐ నేతలను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు. ఆమె మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో వేసిన గుడిసెల్లో ఉన్నవారిని ఎమ్మెల్యే బలవంతంగా బీఆర్ఎస్ లో చేరేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇదే విషయమై సీపీఎం, సీపీఐ లీడర్లు నిలదీస్తే..గుడిసెల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులతో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇందులో భాగంగానే కమ్యూనిస్టు నేతలను మిల్స్ కాలనీ పీఎస్కు తీసుకువచ్చారని మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. తర్వాత వరంగల్ ఏసీపీకి ఫోన్ చేశారు. పోలీసులు ఎమ్మెల్యే నరేందర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మీరు వచ్చేంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. వెంటనే ఏసీపీ బోనాల కిషన్ స్టేషన్ కు వచ్చి సురేఖతో పాటు కమ్యూనిస్టు, కాంగ్రెస్ లీడర్లతో చర్చలు జరిపారు. అదుపులో ఉన్నవారిని పంపించేశారు. కాంగ్రెస్ లీడర్లు కత్తెరశాల వేణుగోపాల్, సిద్ధం రాము, నల్లగొండ రమేశ్, మీసాల ప్రకాశ్, సీపీఎం లీడర్లు నలిగంటి రత్నమాల, మాలోత్ సాగర్, ఓదెలు, ప్రత్యూష పాల్గొన్నారు.