అరెస్టు చేసుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్.

అరెస్టు చేసుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్.

‘ఎవనిదిరా కుట్ర.. ఏంది ఆ కుట్ర.. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు!  నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి!’అని కేటీఆర్  చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. లగచర్ల లో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారిపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు 14  రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. కలెక్టర్ పై దాడికి జరిగిన కుట్రలో కేటీఆర్ హస్తం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేశ్ పట్నం నరేందర్ రెడ్డితో పలుమార్లు ఫోన్లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి సైతం  కేటీఆర్ తో ఆరు సార్లు మాట్లాడినట్టు తేల్చారు. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్ తన స్వరం పెంచారు. తాము రైతుల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. అయితే ప్రధాన నిందితుడికి అక్కడ భూమి ఉందని కేటీఆర్ మీడియా సమావేశాల్లో చెప్పారని, వాస్తవానికి సురేశ్ కు ఆ గ్రామంలో భూమి లేదని కలెక్టర్ తేల్చారు. 

నిందితుల్లో 15 మందికి భూమి లేదని పేర్కొనడం గమనార్హం. దాడి కుట్ర పూరితంగానే జరిగిందని భావిస్తున్న పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. స్వయంగా ఏడీజీ మహేశ్ భగవత్, ఐజీ సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఈ తరుణంలో కేటీఆర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ‘నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?  నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?  గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?  పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!’అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.