హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? అని ప్రశ్నించారు. ‘ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళా బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాడు.
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా కుండా బద్దలు కొట్టాడు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు..? ఇది ముమ్మాటికీ మోసం, నయవంచన. నమ్మక ద్రోహాన్ని రైతులు ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు. గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ కేటీఆర్ ట్వీట్చేశారు.