కాంగ్రెస్​వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్

కాంగ్రెస్​వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల/ జీడిమెట్ల, వెలుగు:  కాంగ్రెస్​వి పచ్చి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు, ఆ రెండు పార్టీలను నమ్మి ప్రజలు మోసపొవద్దని కేటీఆర్ అన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు సిరిసిల్లలోని రైతు బజార్, లేబర్ అడ్డా, బీవైనగర్, వెంకంపేట కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, శుక్రవారం సిరిసిల్లకు వచ్చిన సీఎం పచ్చి అబద్ధాలు చెప్పి పోయిండన్నారు. ఐదు గ్యారంటీలు అమలు చేసిన అని చెప్పిండని, ఎవ్వలకన్నా ఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా అని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల పేర  అర చేతిలో వైకుంఠం చూపెట్టి  ప్రజలను ఆగం చేసిందన్నారు. ‘బీజేపోళ్లు లంగలు. ఇంటింటికి వచ్చి అక్షింతలు ఇచ్చి దేవుడు పేరుతో రాజకీయం చేస్తున్నరు. కంట్రోల్ బియ్యానికి పుసుపు నీళ్లు కలిపి అక్షింతలని చెప్పే లంగలు’ అని ఆరోపించారు. బండి సంజయ్​ ఐదేండ్లు ఎంపీగా ఉండి ఒక్క రూపాయి పని చేయలేదన్నారు. దేవునికి గుళ్లు కడితే ఓట్లేయాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా యాదాద్రి లాంటి గుడి కట్టాడన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిత్యావసరాలు పిరమైనయని, పెట్రోల్ ధరలు పెరిగాయని అన్నారు. మోదీ పదేండ్లలో రూ.30 లక్షల కోట్లు దండుకున్నాడని, ఆయన హయాంలో అదానీ, అంబానీలకు దోచిపెట్టిండే తప్ప దేశానికి చేసిందేమీలేదని దుయ్యబట్టారు. 

నా చెల్లెను జైల్లో పెట్టిన బీజేపీతో కలిసేది లేదు: కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, అందుకే మల్కాజ్​గిరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ అన్నారు. తన చెల్లిని జైల్లో పెట్టిన మతతత్వ పార్టీతో కలిసి వెళ్లేది లేదని, ఎవరో చెప్పే మాటలు నమ్మొద్దన్నారు. కుత్బుల్లాపూర్ షాపూర్​నగర్​లో మల్కాజ్​గిరి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం రాత్రి నిర్వహించిన రోడ్​షోలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘హైదరాబాద్​లో 16 మందికి 16 మందిని ఎమ్మెల్యేలుగా చేసిన కేసీఆర్.. సీఎం కాలేదనే బాధ పోవాలంటే లోక్​సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలి.

లోక్​సభలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్​కు కట్టబెడితే తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ శాసిస్తరు. ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసింది. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదు. కాంగ్రెస్ లీడర్లు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నరు. భవన నిర్మాణాలకు అనుమతులివ్వకుండా బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నరు’’అని ఆరోపించారు. బీఆర్​ఎస్ హయాంలో పరిశ్రమలు తీసుకొస్తే.. కాంగ్రెస్ పాలనలో ఒక్క పరిశ్రమ రాకపోగా.. గుజరాత్, చెన్నైకి తరలిపోతున్నాయని మండిపడ్డారు. ఉన్న పరిశ్రమలను కాపాడుకునే సత్తా కాంగ్రెస్​కు లేదన్నారు.

కేటీఆర్​ను నిలదీసిన మహిళ

సిరిసిల్ల రైతు బజార్​లో కూరగాయలు అమ్ముకుంటున్న ఓ మహిళ కేటీఆర్​ను నిలదీసింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ గ్రామానికి చెందిన తమ భూముల్ని మెడికల్ కాలేజీ కోసం తీసుకున్నారని, భూమికి బదులు భూమి ఇవ్వలేదని, భూమి ఎప్పుడిస్తారని ప్రశ్నించింది. కలెక్టర్​తో మాట్లాడి ఇప్పిస్తానని కేటీఆర్ చెప్పడంతో ఇంకేప్పుడు ఇప్పిస్తవ్ అంటూ నిలదీసింది. కాలేజీ కోసం 50 ఎకరాలు రైతుల భూముల్ని గత ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం ఇవ్వలేదు.