- కానీ ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన బాధ్యత అధికారులదే: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా –ఈ రేస్ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థకు డబ్బులు చెల్లించాలని ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్‌కుమార్‌కు తానే చెప్పానని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కానీ.. ప్రాసెస్ప్రకారం చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని, ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నానని తెలిపారు. అందువల్ల తాను మాట మార్చినట్టు కాదని పేర్కొన్నారు.
‘‘ముందుగా చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా.. ప్రభుత్వం తరుఫున మంత్రిగా ఫార్ములా –ఈ రేస్‌పై నిర్ణయం తీసుకున్నా. ఎఫ్ఈవో సంస్థకు డబ్బు చెల్లించాలని అర్వింద్‌కుమార్‌కు నేను చెప్పా’’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. తనపై ప్రభుత్వం పసలేని, పనికిమాలిన కేసులు పెడ్తున్నదని అన్నారు. అధికార యంత్రాంగం తమ చేతుల్లో ఉందని అవినీతి జరగని అంశంలో ఏసీబీతో కేసులు పెట్టిస్తున్నారని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
‘‘మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కేసులో అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని సీఎంను అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది” అని కేటీఆర్వ్యాఖ్యానించారు. తనపై సర్కారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు పెట్టిందని, వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని అన్నారు. ఫార్ములా –ఈ రేస్ వ్యవహారంలో తనకు డబ్బులు ఎట్లా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘రేవంత్ రెడ్డికి కాదుకదా.. రేవంత్ రెడ్డి తాతకు కూడా నేను భయపడ” అని వ్యాఖ్యానించారు.
అధికారులను సీఎం బ్లాక్‌మెయిల్ చేస్తున్నడు..
ఫార్ములా– ఈ ప్రతినిధులను సీఎం రేవంత్ కలిసిన ఫొటోను బయటపెట్టినందుకు.. అధికారులను సీఎం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘సస్పెండ్ చేస్తా.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తున్నడు. ఫార్ములా– ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి.. వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు? వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఏడాదిపాటు ఎందుకు దాచిపెట్టారు?” అని ప్రశ్నించారు.
వాళ్ల నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నట్టు అనుమానం ఉన్నదని ఆరోపించారు. ‘‘ఫార్ములా –ఈ సంస్థ అనుచిత లబ్ధి పొందింది వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు. 600 కోట్లు అంటూ సీఎం అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నడు. ఫార్ములా– ఈతో కాంట్రాక్ట్‌లను రద్దు చేసుకోవడానికి కేబినెట్ అప్రూవల్ ఉందా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి డైవర్షన్ కోసమే సినిమా వాళ్లపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చనిపోయిన గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారని ఆరోపించారు.
సినిమా వాళ్లతోపాటు గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాలపైనా సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు చేపడతామని కేటీఆర్ తెలిపారు.
పైసా అవినీతి లేదు..
ప్రొసీజర్‌లో పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్లాలిగానీ.. అవినీతి కేసులు పెట్టడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి కాదు.. ఒక్కపైసా కూడా అవినీతికి అవకాశమే లేదు. కోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి మరిన్ని విషయాలు చెప్పలేను. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశా. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ నోటీసులిచ్చింది.
ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నది” అని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఆ లీజును రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.