కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నెల కాకముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, రైతులను క్యూ లైన్లో నిలబెట్టారని విమర్శించారు. నెలన్నరైనా రైతుబంధు ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాలను అసెంబ్లీలో ఎండగట్టామన్నారు. ఇక కమాండర్ కేసీఆర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూడాలన్నారు.
రైతుబంధు రాలేదన్నవాళ్లను చెప్పుతో కొట్టాలని కోమటిరెడ్డి మాట్లాడారు.. మరి రైతుబంధు ఇవ్వని వాళ్లను ఏ చెప్పుతో కొట్టాలని ప్రశ్నించారు కేటీఆర్. కరీంనగర్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగడబతారని చెప్పారు. ఇంకా రెండు లక్షల రుణమాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ వి ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తగిలింది చిన్న దెబ్బన్నారు కేటీఆర్. 14 స్థానాల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయామని చెప్పారు. కొంత మంది సానుభూతితో తమపై గెలిచారన్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మేల్యేలను ప్రజలే నిలదీస్తారని విమర్శించారు. . అబద్ధపు ప్రచారం చేసి మోదీ పీఎం, రేవంత్ సీఎం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ లో బండి సంజయ్ ఒక్క బడి కట్టించలేదు గుడి కట్టించలేదని మండిపడ్డారు కేటీఆర్. కరీంనగర్ లో గంగుల కమలాకర్ గుడి కట్టించారని చెప్పారు. రాజకీయ అజ్ఞాని బండి సంజయ్ ఎంపీగా కావాలా.? చదువుకున్న మేధావి వినోద్ కుమార్ ఎంపీగా కావాలో ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. ఈ ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చేశారో చర్చించడానికి వినోద్ సిద్దమని సవాల్ విసిరారు.