మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట రూ.50 వేల కోట్లు,రెండోసారి రూ. 70 వేల కోట్లు..ఇపుడు లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నారు..మూసీ అంచనా వ్యయం పెంచడం కాంగ్రెస్ ధన దాహానికి సజీవసాక్ష్యం అని అన్నారు.
చివరిదశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..?? అని ట్వీట్ చేశారు కేటీఆర్. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ? అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడుతుందన్నారు కేటీఆర్.
వచ్చే ఐదేండ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని లండన్ లోని థేమ్స్ రివర్ లా అభివృద్ది చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి జూలై 20న చెప్పిన సంగతి తెలిసిందే.. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూసీ అభివృద్ధిని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తుకు వచ్చేలా అభివృద్ది చేస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.