తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు..? కేంద్రంతో కొట్లాడాల్సిందే: కేటీఆర్

తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు..?  కేంద్రంతో కొట్లాడాల్సిందే: కేటీఆర్

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై ఎవరూ మాట్లాడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మేలు జరగాలి. తెలంగాణ ప్రజలు బాగుండాలి. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పమని స్పష్టం చేశారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని.. అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎవరూ మాట్లాడకపోవడం తనకు బాధేసిందన్నారు. 

ముఖ్యంగా డిప్యూటీ సీఎం సీఎం భట్టి విక్రమార్క స్పందించకపోవడం బాధకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రాలేదన్నారు.. మాకు వచ్చింది గుండు సున్నానే.. కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది కూడా గుండా సున్నానే కదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకేమో కేంద్ర నిధుల వరద పారిస్తోంది.. మరీ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 

Also Read :- రాష్ట్రాన్నియూనిట్గా తీసుకుని డీలిమిటేషన్ చేయాలి

11 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను దగా చేస్తోందని.. అసలు రాష్ట్రాలు లేకపోతే కేంద్రమే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తామన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు ఒక్క సీటు రాకపోతే సంబరపడ్డ వాళ్లు.. సీట్లు గెలిచి వాళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు.  కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. గతంలో మేం కూడా సఖ్యతగానే ఉన్నాం కానీ నిధులేమి రాలేదన్నారు. తెలంగాణకు నిధుల కోసం కేంద్రంతో కొట్లాడాలని.. కొట్లాడకపోతే వాళ్లు వినరని అన్నారు. 

కేంద్రంతో కొట్లాడేందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నామని మద్దతు ప్రకటించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. తెలంగాణ బాగుపడాలనేదే బీఆర్ఎస్ విధానమని తెలిపారు. భారతదేశాన్ని సాదుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అలాంటి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే ఒక్కరూ మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేయలేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.11500 కోట్లు ఇచ్చింది.

మరీ తెలంగాణ ఆదిలాబాద్లోని సీసీఐ మాత్రం ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కాదు.. నిస్సాహాయ మంత్రులు అని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆనాడు మాపై ఒత్తిడి తెచ్చారు.. కానీ రైతులకు నష్టం చేకూర్చే ఏ పని చేయబోమని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారని గుర్తు చేశారు. అలాగే.. దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన సమక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం అంటున్న వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థపైన కేటీఆర్ మాట్లాడారు. వన్ ట్రిలియన్ డాలర్ అంటే.. 88 లక్షల కోట్లు.. వన్ ట్రిలియన్ ఎకానమీ  సాధించాలంటే 30 ఏండ్లు పడుతోందని చెప్పారు.