అమెరికా పన్నుల వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుంది: కేటీఆర్

అమెరికా పన్నుల వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుంది: కేటీఆర్

హైదరాబాద్: అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఏప్రిల్ 8) తెలంగాణ భవన్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‎పై అమెరికా విధించిన సుంకాల వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతి అయ్యే ఫార్మా, ఐటీ ఎగుమతులపై అమెరికా విధించిన పన్నుల వల్ల తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూరబోతుందని అన్నారు. 

ALSO READ | గ్యాస్​ ధర పెంపుతో .. గ్రేటర్​పై రూ.7.50 కోట్ల భారం!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే.. ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానాల వలన జీఎస్టీ పెరుగుదల జీరో శాతంగా ఉందని.. ఇప్పుడు ఈ సుంకాల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదని.. పార్లమెంట్లో చర్చ పెట్టమని డిమాండ్ చేసినా పెట్టడం లేదని మండిపడ్డారు. 

బీజేపీ చెప్పిన అచ్చే దిన్ ఇదేనా..?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరల పెంచడంపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిందని ఫైర్ అయ్యారు. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయని విమర్శించారు.

పెట్రోల్ ధరల పెంపు వలన రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయని.. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకులతో అతలాకుతలమవుతోన్న సామాన్యుడి జీవితం ధరల పెంపుతో ఇంకా గుదిబండగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా అని ఎద్దేవా చేశారు.  

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయడం రావడం లేదని.. అందుకే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాలలో ఇన్‎కం పెంచడంలో విఫలమైందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్నది నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్ అని విమర్శలు గుప్పించారు.