పరేషాన్ లో మల్లారెడ్డి!.కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసిందా.?

పరేషాన్ లో మల్లారెడ్డి!.కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసిందా.?
  • మైనంపల్లి ధర్నాకు కారణమదేనా?
  • ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా..?
  • రాయబారానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లతో  తాను పార్ట్ టైం పొలిటీషియన్ ను అని కామెంట్
  • తనకు బిజినెస్ లే ముఖ్యమని వ్యాఖ్య
  •  2 పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరతానని క్లారిటీ!


హైదరాబాద్: వరుస పరిణామాలు మాజీ మంత్రి మల్లారెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో తాను కాలేజీకి వేసుకున్న రోడ్డును ఇటీవలే మున్సిపల్ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో చెరువు శిఖం భూమిని ఆక్రమించి నిర్మించిన భవనాలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. వరుస  పరిణామాలతో టెన్షన్  పడ్డ మల్లారెడ్డి హుటాహుటిన వేం నరేందర్ రెడ్డిని కలిశారు. కూల్చివేతలు ఆపాలని వేడుకున్నారు. అంతటితో ఆగక మరుసటి రోజు బెంగళూరులో  ప్రత్యక్షమయ్యారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తనను పార్టీలో చేర్చుకోవాలంటూ  ప్రాధేయపడ్డారని ప్రచారం జరిగింది. ప్రియాంక, సోనియా అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. తానసలు పార్టీలో చేరేందుకు వెళ్లలేదని, డీకే ను బిజినెస్ పనిమీదే కలిశానంటూ మీడియాకు చెప్పారు మల్లారెడ్డి. ఆ తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.  

నేను పార్ట్ టైం పొలిటీషియన్ ను

మల్లారెడ్డి ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపించగా తాను పార్ట్ టైం పొలిటీషియన్ అను తనకు వ్యాపారాలే ముఖ్యమని  సమాధానం చెప్పారు. రెండుపార్టీలతో టచ్ లో ఉన్నానని, ఏదో ఒక పార్టీలో చేరతానని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారా..? బీజేపీవైపు అడుగులు వేస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది

కాంగ్రెస్ గేట్లు మూసుకున్నట్టేనా..?

మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక  సాధ్యం కాదనే చర్చ మొదలైంది. మల్లారెడ్డి మంత్రిగా కొనసాగిన సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తొడగొట్టి సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మాటమార్చారు. తామిద్దరం స్నేహితులమంటూ మాటమార్చే ప్రయత్నం చేశారు. కబ్జాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఆశ్రయించారు. ఆ తర్వాత డీకే శివకుమార్ ను కలిశారు వర్కవుట్ కాలేదు. నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వారికి మద్దతుగా మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకపోవచ్చనే చర్చనడుస్తోంది. దీంతో ఆయన బీజేపీ వైపు చూసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.