వికారాబాద్, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేవెళ్లలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి అధికారం కోల్పోయిందని విమర్శించారు. ఎంపీగా రంజిత్ రెడ్డి అనేక స్కామ్ లు చేశారని ఆరోపించారు. ఈ నెల 11న వికారాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి, నాయకులు పాండు గౌడ్, శివరాజ్, కేపి రాజ్, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.