కరీంనగర్ టౌన్,వెలుగు: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి అన్నారు. ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక టవర్ సర్కిల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనపై బండి సంజయ్ సమర శంఖం పూరించారన్నారు. టీఆర్ఎస్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించేందుకే సంగ్రామ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అమలుకు నోచుకోలేని హామీలిచ్చిన కేసీఆర్ ప్రజల్ని నిండా ముంచుతున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
రాష్ట్రాన్ని చక్కబెట్టనోళ్లు...
దేశాన్ని ఉద్దరిస్తరా?: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్రాన్ని చక్కబెట్టనొళ్లు దేశాన్ని ఉద్దరిస్తరా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. చైతన్యపురిలోని ఎంపీ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్పై రాష్ట్రంలో ఏర్పడ్డ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సంగ్రామ ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో రైతు రుణమాఫీ హామీ అమలు చేయని కేసీఆర్ దేశ రైతుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని మండిపడ్డారు. 8 ఏండ్ల పాలనలో ఏం చేశారని, ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధనలను విస్మరించి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.