ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ స్కీమ్​ను ఉచితంగా అమలు చేయాలి : హరీశ్‌‌‌‌ రావు

ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ స్కీమ్​ను ఉచితంగా అమలు చేయాలి : హరీశ్‌‌‌‌ రావు

 

  • సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్దీకరణ) స్కీమ్​ను పూర్తి ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌ రావు కోరారు. ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కట్టాలని ప్రజలను అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు చెల్లించకుంటే లేఔట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం రూ.15 వేల కోట్లు వసూలు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమేనని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

 ‘‘ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలి. నాడు ఫ్రీ అని, నేడు ఫీజు అంటున్నారు. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువునా దోచుకునే కుట్ర చేస్తున్నారు”అని హరీశ్ సీఎం రేవంత్‌‌‌‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్, భట్టి, సీతక్క, వెంకట్​రెడ్డి కూడా ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఉచితంగా చేస్తామని చేసిన వ్యాఖ్యలను హరీశ్ లేఖలో ప్రస్తావించారు.

 ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ను రద్దు చేయాలని కోమటిరెడ్డి కోర్టులో కేసు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడేమో ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పేరిట రూ.15 వేల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను పూర్తి ఉచితంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీశ్​రావు పేర్కొన్నారు.