- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపణ
నల్గొండ, వెలుగు : పండలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి మాత్రం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మిల్లర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయనో జోకర్, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదన్నారు. జనగామ, తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో ఎండిన పంటలను మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం పరిశీలించనున్నారని చెప్పారు.
ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ రైతుల బాధలు చూడలేక వాళ్లను ఓదార్చేందుకు వస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌కు పరిపాలన మీద సోయి లేదని, ఇప్పటివరకు వ్యవసాయంపై కనీసం రివ్యూ కూడా చేయలేదన్నారు. కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బలి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పంకజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.