
హైదరాబాద్, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ర్యాలీ నిర్వహించారంటూ 2023లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి11.30 గంటలకు అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా సభ నిర్వహించడంపై అప్పటి ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ సభ్యుడిగా ఉన్న ఇరిగేషన్ అధికారి నాగేశ్వరావు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.