హైదరాబాద్ లోని కోండాపూర్ లో మాజీ మంత్రి హరీశ్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 5న ఉదయం కొండాపూర్ లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు హరీశ్ రావు. అయితే గచ్చిబౌలీ పోలీసులు హరీశ్ రావును ఇంటి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు భారీగా చేరి కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
హరీశ్ రావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు గోడదూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను, హరీశ్ రావును, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు.
హరీశ్ రావును గచ్చిబౌలి పీఎస్ కు తరలిస్తుండగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు పోలీసుల కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిసెంబర్ 4న బంజారాహిల్స్ పీఎస్ లో రెచ్చిపోయారు. తన ఫోన్‌ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి అనుచరులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసులపై రుబాబు చూపెట్టారు. సుమారు 20 మంది అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. హల్చల్ చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేను. మీకు ప్రొటోకాల్ పాటించడం తెలియదా? వచ్చేది మా సర్కారే.. మీ అందరి పని చెప్త” అంటూ పోలీసులపై రెచ్చిపోయారు.
కౌశిక్‌రెడ్డిపై కేసు
ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి పోలీసులను బెదిరించారని, డ్యూటీకి ఆటంకం కలిగించారని, దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు.