మాజీమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి
బోధన్, వెలుగు: సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం బోధన్‌లోని రాకాసిపేట్‌లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ప్రజలకిచ్చిన ఏ హామీని ప్రభుత్వం నేరవేర్చలేదని వాపోయారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎటు పోయాయని ప్రశ్నించారు.
పేరుకే జాబ్ నోటిఫికేషన్లు వేసి, ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, అర్హులైన పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ని ఆదరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్‌చైర్ పర్సన్ భర్త తూము శరత్‌రెడ్డి, కాంగ్రెస్ టౌన్ప్రెసిండెట్ పాషా మొయినోద్దీన్ పాల్గొన్నారు.